Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

ఎట్లు, ఎందులకు ప్రార్థించవలెను?

భగవంతుని మనమెట్లు ప్రార్థించవలెను? ఆయనను ఏ వస్తువులను అడుగవలె?

ఈ విషయమున మనకు సలహా నొసగగల్గిన వారెవరైనా ఉన్న- వారు పుణ్యశీలురును, ఆధ్యాత్మిక శిఖరముల నందుకొన్నవారును అగు మహాపురుషులే. వారిచేతనే మనము ఉపదిష్టులము కావలెను. చికిత్సార్థమువైద్యునికడకు, బ్రతుకుతెరగునకు శ్రీమంతులకడకు యాచనకును, ఆస్తి- తగాదాలకు న్యాయస్థానములకు వెళ్లునట్లే ఆధ్యాత్మిక విషయ వివరణకు మనము మహాపురుషులను ఆశ్రయించవలెను. ఇట్లు ఒక్కొక్క కార్యార్థము ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లతున్నాము. కాని మానవసహాయముచే కోరినదంతయు మనకులభ్యమగుట లేదు. అందువలన మొట్టమొదట మన చిక్కులనూ, తగాదాలనూ భగవంతుని ముందుంచి అటుపై మానవుల సహాయమును ఆపేక్షించవలెను. ఇది ఒక దృష్టి. మరికొందరు భగవంతుని ప్రాపంచిక విషయములకై ప్రార్థించడమెందుకు మోక్షార్థమే ఆయనను ఆశ్రయించదగునని చెప్పుదురు. కాని మనకు బండెడుసంసారము. మనపై ఆధారపడిన బంధువులు అనేకులు. వారిని అనాశ్రయులనుగా వదలి మన విధులనుసరిగా నిర్వర్తించక స్వార్థపరులమై మోక్షకాములము కాలేము. అందుచే మన విధులను మనము నిర్వర్తించవలె. ఎవరయినను మనకు సాయముచేసెడు వారున్న వారి సాయమున మన కష్టములు తొలగించుకొనవలెను. పెరవారికడకుపోవుటకు ముందు మన చిక్కులను, కష్టములను భగవన్నివేదితము చేసి అనుగ్రహములనకై ప్రార్థించవలెను. అవి చిన్న కష్టము లయినను సరే. పెద్ద కష్టములయినను సరే. కర్మలు ఫలవంతము లగుటకు మూడు అంగములు అవసరము. అవి ఈశ్వరానుగ్రహము, పురుషప్రయత్నము, అదృష్టము ఈ మూడూ లేనిచో మన ఈస్సితములు సిద్ధించవు.

శ్రీకృష్ణపరమాత్మ తన భక్తులను నాలుగు తరగతులుగ విభజించెను.

''చతుర్విధా భజంతే మాంజనా స్సుకృతినోర్జున,

అర్తో జిజ్ఞాను రర్థార్థీ జ్ఞానీ చ భరతం్షభ!''

అర్జునా! పుణ్యాత్ములగు వ్యక్తులు నాలుగు రకముల వారు నన్ను భజించుచున్నారు. అందు ఒకరకము ఆర్తులు. రెండవరకము జిజ్ఞాసువులు. మూడవరకము అర్థార్థులు. నాలుగవ రకము జ్ఞానులు.

ఆర్తుడు కుటుంబభారముచే క్రుంగిపోయినవాడు. అతని మానసిక దైహిక బాధలు ఇంతింతకాదు. జిజ్ఞాసువు తత్త్వ జ్ఞానార్థి. అతడు సత్యమును అన్వేషించును. వస్తుగుణములను తెలుసుకొనగోరును. శాస్త్రములు, కళలు మొదల్కొని దివ్య జ్ఞానము, మోక్ష సత్యము వరకు అత డర్థము చేసికొను నిచ్ఛించును. అర్థార్థి ఆర్తుడు కాకపోయినను సౌమంగల్యము, ఔభాగ్యముకల్గించు మంగళవస్తువులను దేవతానుగ్రహమున బొందగోరును. దానధర్మములు చేయునిమిత్తము అతడు ఈశ్వరుని ఐశ్వర్య మడుగును. జ్ఞనమును పొందినతర్వాతకూడ జ్ఞాని దేవుని భజించును. జ్ఞనానిష్ఠుడై ప్రపంచములోని సమస్త వస్తువులలోనూ, భగవంతుని దర్శించుచు ప్రపంచమే భగవత్స్వరూపముగా నాతడు భావించును. దేవుడు తప్ప ప్రపంచమున వేరేమియు లేదని అతని భావన. అందుచే అతడు ప్రాపంచిక విషయములను గూర్చి తలచినను అదియును భగవద్విషయమే అగును. భగవదారాధనమే అగును. 'వాసుదేవ స్సర్వ మితి భజతే జ్ఞనీ' అతని భక్తినీ, సాధననూ అతని జ్ఞనమే సూచించును. సమస్తము వాసుదేవమయమని అతని అనుభవము. 'స మహాత్మా సుదుర్లభః' అట్టి మహాత్ముడు సాధారణముగా ఎక్కడనోగాని ఉండడు.

'వాసుదేవ స్సర్వ మితి' యను జ్ఞానముకలిగేంతవరకు సాధకునివర్తన ద్వైతము. అందు దైవము వేరు సాధకుడు వేరు అనెడు ద్వైతభావనయున్నది. కాని జ్ఞానియొక్క భక్తి అద్వైతభావజనితము. అతని భజనము అనుభవరూప భజనము. అది ప్రార్థనారూప భజనము కాదు. ప్రార్థనారూప భజనమున ప్రార్థించువాడు ప్రార్థింపబడువానికంటె వేరయిన వాడు. ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువుల ప్రార్థన ఈ రెండవ తరగతికి చేరినది.

ఇక దేవుని దేనికై ఏనిమిత్తమై ప్రార్థించుట? ప్రపంచమున నన్ను అనుభవయోగ్యములయిన వస్తువు లన్నిటినీ మనము సేకరించవచ్చును. కాని మనస్సునకుశాంతిలేకపోయిన ఈవస్తుపంచయము ఏతృప్తియను ఇవ్వజాలదు. అందుచే బాహ్య విషయములనుండి కలిగెడు దుఃఖవిమోచనకై మనము దేవుని ప్రార్థించియే తీరవలయును. కాని మనశ్శాంతిలేనిచో దుఃఖములు మనలను వదలిపెట్టక మనతోడనే కాపురము చేయును. భగవత్పాదులు మనకు ప్రార్థించుటెటులో ఆప్రార్థనలో అర్థించవలసిన విషయములేనియో చెప్పియున్నారు. వారు వ్రాసినదే ఈక్రింది షట్పదీస్తోత్రము.

అవినయ మపనయ విష్ణో |

దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్‌,

భూతదయాం విస్తారయ

తారయ సంసారసాగరతః||

దివ్యధునీమకరందే

పరిమళ పరిభోగ సచ్చిదానందే,

శ్రీపతివదారవిందే

భవభయ భేదచ్ఛిదే వందే||

సత్యపి భేదాపగమే

నాథ త వాహం న మామకీన స్త్వమ్‌,

సాముద్రో హి తరంగః|

క్వచన సముద్రో న తారంగః||

ఉద్ధతనగ నగభిదనుజ

దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే,

దృష్టే భవతి ప్రభవతి

న భవతి కిం భవతిరస్రారః||

మత్స్యాదిభి రవతారై

రవతారవతా7వతా సదా వసుధామ్‌,

పరమేశ్వర పరిపాల్యో

భవతా భవతాపభీతోహమ్‌||

దామోదర గుణమందిర

సుందరవదనారవింద గోవింద,

భవజలధిమథనమందర

పరమందర మపనయ త్వం మే||

నారాయణ కరుణామయ

శరణం కరవాణి తావకౌ చరణౌ,

ఇతి షట్వదీమదీయే

వదనసరోజే సదా వసతు||

ప్రథమశ్లోకమున ఆచార్యులు 'అవినయమపనయవిష్ణో యని ప్రార్థించిరి. అనగా మనమును అట్లు ప్రార్థించవలెనని యర్థము. ప్రతియొక్కరికిని ముఖ్యముగా నుండవలసిన గుణము వినయము. వినయ మను ఒక పదము అణకువ మర్యాద మార్దవము తిన్నదనములను సూచించును. వినయము నాగరితాచిహ్నము. ప్రజలలో వినయమును పెంపొందించు విధి మన ఆచారప్రకారము రాజుయొక్క ధర్మము. దిలీపమహారాజు గూర్చి కాళిదాసు 'ప్రజానాం వినయాధానాత్‌ రక్షణాత్‌ భరణా దపి' అని రఘువంశకావ్యమున వ్రాసినాడు. అనగా అంతఃకలహము, విదేశీయుల దండయాత్రనుండి రక్షించుట, ప్రజల యోగక్షేమములను భరించుట. ఇవేగాక ప్రజలను వినయమార్గ ప్రవర్తకులుగా చేయుటకూడ రాజవిధియైయున్నది.

అటులనే శిష్యునియందు వినయము పెంపొందించుట గురువుయొక్క విధి. శిష్యుని 'వినేయు'డనియు అందురు. అనగా వినయమునకు శిక్ష కావలసినవాడని అర్థము. గురువు వినేత. ఈ వినయభావము, మన శాస్త్రము లెంత పురాతనములో అంత పురాతనమైనది. గీతయందు ''విద్యావినయ సంపన్నే'' యని ఉన్నది. శిష్యుడనగా వినయమున సుశిక్షితుడగు వాడని యర్థము.

శిష్య పదమునుండియే శిక్కులనెడు మాటయుపుట్టినది. శిక్కులు తమ గురువును పూజింతురు. వారి మత ప్రవక్తలు గురునానక్‌, గురుగోవిందుడు. తమిళములోను మళయాళములోను గల విత్తగన్‌ అనుపదము వినీత అను పదమునుండి వచ్చెను.

మొట్టమొదట ఆచార్యులు 'అవినయ మపనయ'్సనా అవినయమును తొలగింపుమని ప్రార్థించిరి, వినయము సౌగుణ్యమునకు పునాది, అవినయము దానికి విరోధి. తరువాత 'శమయ మనః'్సనా అహంభావమును పోగొట్టుము. 'దమయ విషయమృగతష్ణాం' ్సవిషయవాసనలు ఎండమావులవంటివి. మనస్సును సవికల్పము చేయునది. మరీచికలలో ఎంత నీరు త్రావినను దాహముతీరదు. 'భూతదయాంవిస్తారము'్ససమస్త భూతములందును నాకు విస్తారమగు దయకల్గునట్లు చేయుము. (దీనిఫలముచే) 'తారయ సంసారసాగరతః'్సఈ సంసారసాగరమును దాటింపుము.

రెండవ శ్లోకమున ఆచార్యులు శ్రీపతియగు భగవన్నారాయణుని పాదపద్మములకు ప్రణమిల్లిరి. మనమును అట్లే చేయవలెనని సూచన. మొదటిశ్లోకమున చెప్పబడిన గుణము శ్రీపతి యనుగ్రహమున కాని కలుగదు. ఆయన దయ చేగాని ఇవి మనకు పొందుపడవను దృఢవిశ్వాస ముండవలెను.

మూడవశ్లోకమున భగవంతునిపై మనము ఎట్లు ఆధారపడియున్నామో సూచింపబడినది. భక్తునకును భగవంతునికిని భేదభావము తొలగి అద్వైతానుభవమంఉద కలిగే భావమును ''నే నేమో నీవాడను కాని, నీవు మాత్రము నావాడవు కావు. తరంగము సముద్రమునకు చెందునుగాని. సముద్రము తరంగమునకు చెందదు. ఈ తరంగమునకును, సముద్రమునకును ఆ భేదము నిజమేకాని, తరంగము సముద్రమున పుట్టినది. సముద్రము తరంగమున పుట్టలేదు'' అని ఆచార్యులు వ్రాసిరి.

నాలుగవ శ్లోకమున ముక్తపదగ్రస్త అలంకారముకాననగును. ''ఉద్ధృతనగ నగభిదనుజ, దనుజకులామిత్ర, మిత్రశశిదృష్టే; దృష్టే భవతి, ప్రభవతి, న భవతి కిం భవతిరస్రారః''

ఉధ్ధృతనగ్సఃఅనగా గోవర్థనగిరిని పైకెత్తినవాడా?

నగభిదనుజ్స పర్వతములకు విరోధియగు ఇంద్రుని తమ్ముడవు, ఉపేంద్రుడవు.

దనుజకులామిత్స్ర రాక్షసగణములకు విరోధివి.

మిత్రశశిదృష్ట్సే సూర్యచంద్రులుకన్నులుగాగలవాడా!

భవతి దృష్టే ప్రభవతి (సతి)్స నీ దృష్టి ఎపుడు నాపై ప్రసరించునో 'భవతిరస్కారః న భవతి కిమ్‌' ్స అపుడు ఈ సంసార సాగరము దాటుట కష్టమా ఏమి?

ఈ శ్లోకము ఈ క్రింది ఉపనిషద్వాక్యమును జ్ఞప్తికి దెచ్చును.

''భిద్యతే హృదయ గ్రంథి శ్ఛిద్యంతే సర్వసంశయాః,

క్షీయంతే చాన్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే||''

హృదయగ్రంథులన్నియు భేదింపబడును. సంశయములన్నియు ఛేదింపబడును. సర్వకర్మములును క్షీణములగును. (నశించును) ఎప్పుడు? కడుపెద్దదియు, కడుచిన్నదియు అగు వస్తువును ఎపుడు దర్శింతుమో, అపుడు, ఇవి యన్నియు పరంపరగా జరిగిపోవును.

ఐదు, ఆరవశ్లోకములు మత్స్య, కూర్మావతారముల గూర్చి ప్రార్థన. ఆచార్యులు- దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవిందభవజలధి మథనమందర-అని ఈ అవతారములను ప్రార్థింతురు. తనలోని చెడ్డతనమును తొలగింపుమని ఇందలి ప్రార్థన.

కడపటిశ్లోకమున ఈషట్పదీస్తోత్రమున వదనసరోజమున సదా వసించవలెనను ప్రార్థన చేయబడినది. ఈ ఆరుశ్లోకములే కాదు, కడపటిశ్లోకమునందలి పూర్వార్థముననున్న 'నారాయణ కరుణామయ శరణం కరవాణి తానకౌచరణౌ' అనునది అనన్య శరణాగతిని సూచిస్తున్నది. ఇట్లు ఈస్తోత్రమున మొదటి ఆరు శ్లోకములొకషట్పది. కడపటిశ్లోకమున మరియొక చిన్నషట్పది. మరియొక విశేషము. షట్పది యనగా తేనెటీగ. భక్తుడనే తేనెటీగ అందు ఇందు తిరిగి-కట్టకడపట గోవిందుని ముఖారవిందమునను. నయనారవిందమునను, చరణారవిందమునను వ్రాలి అందలి మధువును గ్రోలును.

ఆరవ శ్లోకమునందలి గుణమందిర శబ్దమునకు భగవానుడు సర్వగుణ పరిపూర్ణుడని యర్థము. అద్వైతులు బ్రహ్మమును నిర్గుణమని యందురు. వేదాంతులలో కొందరు బ్రహ్మమును సగుణమని చెప్పుదురు. పగటిపూట సూర్యకాంతి తెల్లగ నుండును. తెలుపు ఒకరంగుకాదు; అన్ని రంగుల మిశ్రమము. అటులనే అన్ని గుణములు బ్రహ్మమందు కలియును. సగుణ బ్రహ్మము నిర్గుణమగును. కావున శాస్త్రయుక్తముగా గుణ పరిపూర్ణతయే నిర్గుణమగునని తెలియుచున్నది. అంతిమమున బ్రహ్మముయొక్క సగుణ నిర్గుణభావములకు విరోధము ఏదియును లేదు.

'భవ జలధి మథన మందర' యనుటలో మన మందరమును జీవితములోని కష్టసుఖముల నెదుర్కొనియే మోక్షమునొందవలెనని అర్థము. వృక్షమునకు పై బెరడున్నది. లెక్కలేనన్ని ఆకులున్నవి. బెరడు వృక్షములోని జీవమును రక్షించును. ఆకులవలన పూలు పుట్టుచున్నవి. జీవితవృక్షమున గల చేదు-మోక్షమనెడు తీపికి- దారితీయు సోపానము. ఇందు మరువ గూడని నియమము ఒక్కటే. అది దైవభక్తి. ఆయనయే మందరము అనగా కవ్వము. ఈ సంసారసముద్రమును మధించి అమృతమును పొందవలెనన్న మనము కవ్వమును మరువరాదు.

భగవద్గీతవలెనే షట్పదియు ఒకేపదముతో ప్రారంభించి అదే పదముతో ముగింపబడుచున్నది. అర్జునునికి ఉపదేశము 'అశోచ్యా నన్వశోచ స్త్వమ్‌' అని ప్రారంభింపబడి 'మా శుచః' అను పదముతో ముగింపబడును. షట్పదియందు ఆచార్యులును 'అవినయ మపనయ' యని ప్రారంభించి 'అపనయత్వమ్‌ మే' యని ముగించినారు.

పరమాచార్యులైన శంకరాచార్యులచే ప్రణీతమై పవిత్రమైన ఈ స్తోత్రము సదా మా వదనసరోజములయందు నిలుపుము శ్రీమన్నారాయణమూర్తిని మనము సదా ధ్యానింతము గాక!


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page